Monday, December 5, 2016

ఎముకలు లేని కోడిమాంసం వేపుడు

ఎముకలు లేని కోడిమాంసం - 1/4 కే.జి
అల్లం,వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు 
పచ్చి మిర్చి - 4
కారం - 1 1/2 టీ స్పూను 
ధనియాల పొడి  - 1 టీ స్పూను 
చాట్ మసాలా - 1/2 టీ స్పూను
గరం మసాలా - 1/ 2 టీ స్పూను 
ఉల్లిపాయ - 1
నిమ్మరసం - 2 టీ స్పూన్లు 
ఉప్పు - సరిపడా 
నూనె - సరిపడా
                                                                                         ఒక గిన్నెలో కోడిమాంసం వేసి నూనె గరం మసాలా తప్ప మిగిలిన పదార్దాలన్నీ కలిపి ఒక అరగంట నాననివ్వాలి.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా తరగాలి.ఒక బాండీలో నూనె వేసి కాగాక కొన్నికొన్నికోడిమాంసం ముక్కలు వేసి వేయించి తీసి ఒక ప్రక్కన పెట్టాలి.తర్వాత ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక చికెన్ ముక్కలు వేసి గరం మసాలా చల్లి అటుఇటు తిప్పి తీసేయాలి.

Wednesday, September 21, 2016

మునగాకు గోరుచిక్కుడు వేపుడు

మునగాకు - గుప్పెడు
లేత గోరుచిక్కుడు కాయలు - 1/4 కె.జి
పెసరపప్పు- గుప్పెడు
ఉల్లిపాయ పెద్దది - 1
పచ్చి మిర్చి - 4
వెల్లుల్లి - 5 రెబ్బలు
వేపుడు కారం -1 టేబుల్ స్పూను(ఎండు మిర్చి,జీరా మిక్సీలో వేయాలి)
ఉప్పు - సరిపడా
                                                                 ముందుగా గోరు చిక్కుడు కాయలు ముక్కలు కోసి మెత్తగా కాకుండా ఉడికించాలి.పెసరపప్పు కడిగి మెత్తబడకుండా కొద్దిగా ఉడికించి నీళ్ళు వంపి పక్కన పెట్టాలి.బాండీలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి,తాలింపు దినుసులు,కరివేపాకు,మునగాకు వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనిచ్చి గోరు చిక్కుడు ముక్కలు వేసి కొద్దిగా వేగాక పెసరపప్పు వేసి వేగనివ్వాలి.వెల్లుల్లి దంచి వేసి,ఉప్పు,వేపుడు కారం వేసి రెండు సార్లు అటుఇటు తిప్పి దించేయాలి.అంతే ఘుమఘుమలాడుతూ నోరూరించే మునగాకు గోరుచిక్కుడు వేపుడు తయారయినట్లే.మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది.మనం చెబితే తప్ప మునగాకు అనే విషయం తెలియదు.

Tuesday, September 13, 2016

ఆవిరి పూర్ణాలు

         పూర్ణం తయారీకి :
పచ్చి శనగపప్పు /పెసరపప్పు - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
వేయించిన నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
వేయించిన కొబ్బరి పొడి - 2 టేబుల్ స్పూన్లు (నూనె లేకుండా)
యాలకుల పొడి -- 1 స్పూను

పూర్ణం పైన పెట్టడానికి:
బియ్యప్పిండి - 2 కప్పులు
మంచినీళ్ళు - మూడు కప్పులు
నెయ్యి -1 స్పూను
ఉప్పు - కొద్దిగా
                                                                         పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించి గరిటెతో పప్పును మెత్తగా చేసి దానిలో బెల్లం తురుము,వేయించిన కొబ్బరితురుము,నువ్వులపొడి వేసి నీరు ఇగిరి పోయేంత వరకు తిప్పాలి.ఒక పక్కనపెట్టి ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి కొద్దిగా ఉప్పు,నెయ్యి వేసి కలపాలి.దానిలో ఉండలు కట్టకుండా బియ్యప్పిండి వేసి తిప్పుతూ దగ్గరకు వచ్చి ముద్దలా అయిన తర్వాత దించేయాలి.ఆరిన  తర్వాత ఈ పిండిని చిన్న పురీల్లా వత్తి దానిలో పూర్ణం పెట్టి మూసేసి గుండ్రంగా చేయాలి.అన్నీ ఇలాగే తయారు చేసుకుని ఇడ్లీ కుక్కర్ లో ఆవిరి మీద ఒక 5 ని.లు ఉడికించాలి.

వెలగ వడ

మినప్పప్పు - 1 కప్పు
పచ్చి శనగపప్పు - 1 కప్పు
పెసర పప్పు - 1/2 కప్పు
వెలగ పండు గుజ్జు  - 1/2 కప్పు
పచ్చి మిర్చి - 5
ఉల్లిపాయ - 1
కరివేపాకు - కొద్దిగా 
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
                                                                        మూడు రకాల పప్పులు కలిపి శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.తర్వాత నీళ్ళు వంచేసి మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి.అందులోనే బాగా పండిన వెలగ పండు గుజ్జు,సన్నగా తరిగిన అల్లం,పచ్చిమిర్చి,ఉల్లిపాయ ముక్కలు,సన్నగా తరిగిన కొత్తిమీర,కరివేపాకు,ఉప్పువేసి బాగా కలిపి వడల మాదిరిగా వత్తి కాగిన నూనెలో వేయించి తీసేయాలి.అంతే రుచికరమైన వెలగ వడలు సిద్ధం.దీనిని కొబ్బరి పచ్చడితో లేదా ఎవరికి ఇష్టమైన దానితో వాళ్ళు  తినవచ్చు.

Thursday, February 18, 2016

జంతికలు

బియ్యం - 1 కె.జి
మినప్పప్పు - 1 కప్పు
వాము -  చారెడు
ఉప్పు -  సరిపడా
పచ్చి కారం - 2 టీ స్పూనులు
నువ్వులు - 50 గ్రా.
                                         బియ్యం శుభ్రంగా కడిగి ఎండ పోయాలి.పొట్టులేని మినప్పప్పు వేయించి ఈరెండు కలిపి మర పట్టించి ఒక డబ్బాలో పోసుకుని ఎప్పుడంటే అప్పుడు కొంచెం పిండితో అయినా వండుకోవచ్చు.అప్పుడు షుమారుగా పై కొలతలు వచ్చేలా పిండి కలుపుకోవాలి.పిండి కలిపేటప్పుడు కొద్దిగా కాగిన నూనె పోసి నేలలతో కొద్దికొద్దిగా కలుపుకోవాలి.అప్పుడు రుచిగా కరకరలాడుతూ బాగుంటాయి.నూనెలో వేగుతాయి కనుక పచ్చి నువ్వులు కలుపుకోవాలి. 

చక్రాలు

బియ్యప్పిండి - 1 కె.జి
నువ్వులు - 50 గ్రా.
ఉప్పు - సరిపడా
వాము - చారెడు
పచ్చి కారం - 1 టీ స్పూను
                                                       బియ్యం శుభ్రంగా కడిగి పలుచటి వస్త్రంపై ఎండబెట్టి మర పట్టించాలి.వాము నానబెట్టి శుభ్రంగా కడగాలి.ఒక ప్లేటులో బియ్యప్పిండి,పచ్చి నువ్వులు,ఉప్పు,వాము,కొద్దిగా కాగిన నూనె,పచ్చి కారం అన్నీ బాగా కలిపి ఒక గిన్నెలో పోసి కొంచెం కొంచెం పిండి నీళ్ళతో కలుపుకోవాలి.చక్రాల గిద్దలకు నూనె రాసి దానిలో కలిపిన పిండి పెట్టాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి కాగిన తర్వాత మనకు కావలసిన సైజులో గుండ్రంగా చక్రాలు వత్తుకుని వేగాక తీసి ఒక కాగితంపై వేస్తే నూనె లేకుండా బాగుంటాయి.వీటిని పొడి డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల వరకు చాలా రుచిగా ఉంటాయి.  

Tuesday, February 16, 2016

కజ్జికాయలు

బొంబాయి రవ్వ - 1 కె.జి
పుట్నాలు - 1/2 కె.జి
ఎండు కొబ్బరి - 1/2 కె.జి
బెల్లం - 1 కె.జి
 యాలకులు 1 100 గ్రా.
జీడిపప్పు - 25 గ్రా.
గోధుమపిండి - 1/2 కె.జి
మైదా - 1/2 కె.జి
                                             ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి.పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకోవాలి.బెల్లం సన్నగా తురమాలి.ఎండు కొబ్బరి తురుముకోవాలి.యాలకులు పొడి చేసుకోవాలి.జీడిపప్పు దోరగా వేయించుకుని చిన్నచిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.ఒక పెద్ద ప్లేటులో ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి.గోధుమ పిండి,మైదా కలిపి ఒక ప్లేటులో పోసి మధ్యలో గుంట చేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి.కాస్త కాస్త పిండి తీసుకుని పెద్ద చపాతీ చేసుకుని కజ్జికాయల చెక్కకు నూనె బాగా రాసి దానిపై చపాతీ పెట్టి లోపలకు కొంచెం నొక్కినట్లుగా చేసి దానిలోరెండు టేబుల్ స్పూనుల పొడివేసి వేళ్ళతో అంచులకు బాగా నీళ్ళు రాసి గట్టిగా నొక్కి మూసేయ్యాలి.అంచుల బయటకు వచ్చిన చపాతీని తీసేయాలి.ఒక ప్లేటుకు పలుచగా నూనె రాసి దానిలో తయారు  చేసుకున్న  కజ్జికాయలు పెట్టుకుని ఒక్కొక్కటి తీసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.అంతే రుచికరమైన కజ్జికాయలు తయరయినట్లే.ఇవి 10-15 రోజులు నిల్వ ఉంటాయి.  
గమనిక:పొడి కలిపి పెట్టుకుని కావలసినన్ని చేసుకుని మిగిలిన పొడిని ఫ్రిజ్ లో జిప్ లాక్ కవర్లో పోసి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.గోధుమ,మైదా 1:1 కొలతతో ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు.

Monday, February 15, 2016

రొయ్యల సమోసా

రొయ్యలు - 1/4 కె.జి
గోధుమ పిండి - 1/2 కె.జి
బీన్స్,కారట్ కలిపి - 1/2  కప్పు
బంగాళ దుంపలు - 1
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
పిండి:గోధుమ పిండిలో కొంచెం ఉప్పు,నూనె వేసి సరిపడా నీళ్ళు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకుని కొంచెం సేపు నానబెట్టాలి.
స్టఫింగ్ కోసం:రొయ్యలు ఉప్పు,పసుపు వేసి ఉడికించి సన్నగా ముక్కలు కొయ్యాలి.కొంచెం నూనె వేసి సన్నని ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి పేస్ట్,రొయ్యలు వేసి వేయించాలి.తర్వాత కారట్,బీన్స్ తురుము వేయాలి.బంగాళదుంప ఉడికించి మెత్తగా చేసి వేసి వేయించి ఉప్పు,గరం మసాలా,కొత్తమీర వెయ్యాలి.చివరగా నిమ్మరసం 1 స్పూను వేసి కలిపి చల్లార్చాలి.
సమోసా:చపాతీ చేసి మధ్యకు కట్ చేసి ముక్కోణపు ఆకారంలో మడిచి లోపల మిశ్రమం పెట్టి నీళ్ళతోఅంటించాలి. అన్నీ తయారు చేసుకుని మధ్య రకం మంటపై వేయించుకోవాలి.అంతే నోరూరించే రుచికరమైన రొయ్యల సమోసా తయారయినట్లే.

Sunday, February 14, 2016

ఉండ్రాళ్ళ పాయసం

పెసర పప్పు - 1/4 కప్పు
ఖర్జూరాలు - 5
బియ్యపు రవ్వ - 1/2 కప్పు 
బియ్యప్పిండి - 1/2 కప్పు 
పచ్చి కొబ్బరి తురుము - 1/4 కప్పు 
కొబ్బరి పాలు - 1 1/2 కప్పు 
పంచదార - 1 కప్పు
మొక్కజొన్న పిండి - 1/2 స్పూను 
నెయ్యి - 2 టేబుల్ స్పూనులు 
ఉప్పు - చిటికెడు 
యాలకుల పొడి - 1/4 స్పూను 
జీడిపప్పు,ఎండు ద్రాక్ష కలిపి  - ఒక 1/4 కప్పు
                                                                                ముందుగా పెసర పప్పు ఖర్జురాలను ఒక గం.ముందు నానబెట్టుకోవాలి. ఖర్జురాలను గింజలు తీసి మిక్సీలో వేసి 1 1/2 కప్పు అయ్యేలా నీళ్ళు చేర్చుతూ చిక్కటి రసం తీయాలి.స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నెయ్యి వేసి బియ్యపు రవ్వ,బియ్యప్పిండి దోరగా వేయించుకోవాలి.ఖర్జూర రసాన్ని ఒకగిన్నెలో పోసి ఉప్పు వేసి మరిగించాలి.ఇందులో పెసరపప్పు,వేయించి పెట్టుకున్నబియ్యప్పిండి,రవ్వ వేసి కలిపిన తర్వాత కొబ్బరి తురుము వేసి దగ్గరకు రానిచ్చి దింపేయాలి.కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసి 5 ని.లు ఆవిరిపై ఉడికించాలి.మరో గిన్నెలో కొబ్బరిపాలు తీసుకుని పంచదార కలిపి పొయ్యి మీద పెట్టి మరిగేటప్పుడు ఉండ్రాళ్ళు వేయాలి.ఒక 5 ని.లు అయ్యాక ఒక స్పూను నీళ్ళల్లో మొక్కజొన్న పిండి వేసి కలిపి పాయసంలో వేసి తిప్పాలి.జీడిపప్పు,ద్రాక్ష నేతిలో దోరగా వేయించుకుని మిగిలిన నెయ్యి,యాలకులపొడి వేసి ఒకసారి తిప్పి దింపేయాలి.అంతే ఘుమఘుమలాడే నోరూరించే ఉండ్రాళ్ళ పాయసం సిద్ధం.    

కారట్ హల్వా

కారట్ తురుము - 4 కప్పులు
పాలు - 3 కప్పులు
పంచదార - 1 కప్పు
జీడిపప్పు - 6
బాదం - 6
యాలకుల పొడి - కొంచెం
నెయ్యి - 4 స్పూనులు
                                                      కారట్ తురుమును నెయ్యి వేసి వేగనిచ్చి పాలుపోసి ఉడికించాలి.పంచదార వేసి కరిగిన తర్వాత బాగా దగ్గరకు రానిచ్చి యాలకుల పొడి సన్నగా తరిగిన జీడిపప్పు,బాదం పప్పు పలుకుల్ని దోరగా వేయించి కలపాలి.అంతే రుచికరమైన కారట్ హల్వా తయారయినట్లే.తినడమే తరువాయి.

పాయసం

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 చారెడు
బెల్లం - 1 కప్పు
పంచదార - కొంచెం
పాలు - 1 లీటరు
నీళ్ళు - 1/2 లీటరు
యాలకులపొడి - 1/4 టీ స్పూను
జీడిపప్పు - 10
కిస్మిస్ - 10
 నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
                                                                          ముందుగా బియ్యం,పెసరపప్పుశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో 1/4 గం.నానబెట్టాలి.మందపాటి గిన్నెలో పాలు,నీళ్ళు పోసి పొంగు రాగానే కడిగి   పెట్టుకున్న బియ్యం,పెసరపప్పు వేసి బాగా ఉడికించాలి.రైస్ కుక్కర్లో అయితే కాగిన పాలు పోసి బియ్యం,పప్పు వేసేస్తే మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే సరిపోతుంది.దేనిలో అయినామెత్తగా ఉడికిన తర్వాత తురిమిన బెల్లం,కొంచెం పంచదార,యాలకుల పొడి వేసి తిప్పాలి.స్టవ్ వెలిగించి చిన్న నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు,కిస్మిస్ వేయించి పాయసంలో కలుపుకోవాలి.ఎంతో మధురమైన పాయసం తయరయినట్లే.కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.